కంగారు పడకండి , నేనేమి మిమ్మల్ని దెయ్యాలు కథలు చెప్పి రాంగోపాల్ వర్మ లా నవ్వించలేను
ఏదో నా చిన్న అనుభవం మిమ్మల్ని కొంచెం నవ్విస్తే అంతే చాలు.
కొంచెం బ్యాక్ కి వెళితే .......
అయ్యో మిమ్మల్ని కాదండి బాబు, ఫ్లాష్ బ్యాక్ కి వెళితే అని అర్ధం.
నేను 8th / 9th చదువుతున్నాను.
మా వీధి చివరన అంతా పెద్ద పెద్ద కొబ్బరి తోటలు. మా ఇల్లు కూడా ఆ చివరనే ఉండేది. మా ఇల్లు దాటితే అన్నీ పంట పోలలే. ఒక సాయంకాలం, వీధిలో ఫ్రెండ్స్ తో ఆటలన్నీ అయిపోయాకా అందరికి కొబ్బరి బొండాలు తాగాలని కోరిక పుట్టింది. కొరికితే పుట్టింది కాని బొండాలు ఎక్కడ దొరుకుతాయి.
అమ్మ కొబ్బరి బొండాం తాగుతాను అంటే వెంటనే కొంగు ముడి విప్పి డబ్బులు ఇచ్చే కాలం కూడా కాదు అంతలా , మా ఇళ్ళల్లో మాత్రం అలా లేదు. అడిగితె ఒక్క అయిదు నిమిషాలు ఆగు , అన్నం వార్చి గంజి లో ఉప్పేసి ఇస్తాను అని చెప్తారు. పావాలా కి సోడా వచ్చే ఆ కాలం లో మా దగ్గర పది పైసలు కూడా ఉండేవి కాదు.
అందుకని ఇక నిర్ణయం తీసుకున్నాం, దొంగతనం చేయాల్సిందే అని.
ప్లాన్ రెడీ అయిపొయింది , ఒక గొనె సంచి తీసుకున్నాం. చెట్టు పైకి ఒకడు ఎక్కి కాయలు తెంచి కిందన పడేయాలి, కిందన మేము గొనె సంచి పట్టుకుని నిలబడతాం , అందులోనే పడేయాలి ఎందుకంటే నెల మీద పడితే మళ్ళీ సౌండ్ వస్తుంది. చెట్టు కూడా ముందే సెలెక్ట్ చేసేసాం. ఆ ముందు రోజు పొలాల్లో అడుకునేటప్పుడు ఒక చెట్టు చూసాం మరీ పొడవు గా ఏమి లేదు. కాయలు కుడా బాగానే ఉన్నాయి. సరే రాత్రి తొమ్మిది అయ్యింది అన్నం తినేసి అందరం బయటకి వచ్చాం. నలుగురం బయలుదేరాం. అందరు ఒకటే ఆలోచిస్తున్నారు ఎవర్ని చేట్టేక్కిన్చాలా అని.
పొలాల్లో కి వచ్చాం ఒక అయిదు నిమిషాలు నడిచి అంతా చీకటి గా ఉంది, దూరంగా మా ఇల్లులు కనిపిస్తున్నాయి లైట్లు వెలగడం కనిపిస్తుంది. అప్పట్లో ఎప్పుడు ఆ బీడు భూముల లోను, పొలాల్లోనూ తిరిగేవాళ్ళం కాబట్టి పెద్ద భయం అనిపించలేదు మాకు. కొంచెం భయం ఉంది కాని, అవన్నీ మేము తిరిగినావే కాబట్టి ధైర్యంగానే ఉన్నాం.
చేట్టేవడు ఎక్కాలో కాసేపు గొడవపడి , ఎక్కినోడు ఒక కాయ ఎక్సట్రా తాగుతాడు అని తీర్మానించి మొత్తానికి ఒకన్ని ఎక్కించాం . ఇప్పుడు చూడాలి నా సామి రంగా వాడు కాయ పట్టుకుని దానిని తిప్పడం మొదలెట్టాడు , మేము కత్తి తీసుకుని రావడం మర్చిపోయం కంగారులో, అయిదు నిమిషాలు అయింది ఇంకా తిప్పుతూనే ఉన్నాడు, కిందన మాకు తడిసిపోతుంది కంగారుకి. చుట్టూ చీకటి ,కప్పల సౌండ్, నక్కలు ఈలలు వేస్తున్నాయి. నలుగురుం ఉన్నాం కాబట్టి సరిపొయింది. త్వరగా రా అని అరవడానికి కూడా భయంగా ఉంది. ఏదో గుస గుస గా చెప్పాం కాని వినపడలేదు ఆ ఎదవకి. ఎలా వినపడుతుంది నక్కలు, కప్పలు ఏదో జూ ఎన్ టి అర్ సినిమాకి విసిల్స్ ఎసినట్టు ఏస్తున్నాయి. మేమిద్దరం గోనెసంచి పట్టుకుని రెడీ గా ఉన్నాం. నాకు భయమేస్తుంది వాడు ఎక్కడ విసురుతాడో అని , అప్పుడు అనిపించింది కొబ్బరి నీళ్ళు కన్నా గంజి నీళ్ళే ఎంతో బాగుంటాయి అని. అలాగే విసిరాడు కిందకి గురిచూసి , సంచి లోకి విసురుతాడు అనుకుంటే అవతలి వాడి జేబులో పడేటట్టు విసిరాడనుకుంటా, కొంచెం లో రాసుకుంటూ కింద పడింది, ఆ దెబ్బకి వాడు బూతులు §$%&/(/()= తిట్టి నేను చచ్చిన పట్టుకోను ఈ సంచి అని వదిలేసాడు. నాకు కూడా భయమేసింది కొంచెం వెనక్కి వెళ్లి నిలబడ్డాను. వాడు మూడు కాయలు తిప్పబోసరికి అరగంట పైనే అయిపొయింది.
అప్పుడు చూసాం దూరంగా ...
రెండు లాంతార్లు పరిగెడుతున్నాయి. మేము కొయ్యబారిపోయి చూస్తున్నాం. దూరంగా ఉన్నాయి , రెండూ ఒకరికొకరికి దూరంగా వెళ్తున్నాయి దగ్గరకి వస్తున్నాయి. మాకేమి అర్ధం కావడం లేదు. కాని ఒకటి మాత్రం అర్ధం అయింది అవి కొరివి దెయ్యాలని , చిన్నప్పటి నుండి దెయ్యాల గురించి మాట్లాడుకున్నవన్ని ఒక్కసారిగా గుర్తొచ్చాయి. మాకు వణుకు మొదలైంది , అవి దగ్గరికే వస్తున్నాయి. మా వాడు తేరుకుని వొరేయ్ ధనా ( చెట్టు మీద ఉన్నవాడు ) దెయ్యం రొయ్ అని అరిచాడు. ఈసారి నక్కల కన్నా వీడే గట్టిగా అరిచాడు.
అంతే వాడు చెట్టు మీద నుండి సగమే కిందకి జారాడు, మిగతా సగం ఎలా వచ్చాడో తెలియదు, చుస్తే ఆల్రెడీ అందరు కాయలు పట్టుకుని పరిగెడుతున్నారు. నేను కూడా నా కాళ్ళ దగ్గర ఉన్న కాయ తీసుకుని పరిగెట్టాను. పరిగెత్తి పరిగెత్తి మా రోడ్ మీదకి వచ్చి ఒగుర్చుకుంటూ నిలబడ్డాం. ఒకడిన్టిపక్కన పక్కన కూలబడి చూసుకున్నాం.
చేట్టేక్కినోడికి extraa కాయకాదు కదా అసలు కాయే లేదు వాడికి. పాపం అందరి దగ్గర తల కొంచెం నీళ్ళు తాగాడు తిట్టుకుంటూ.
మరుసటి రోజు తెలిసింది , ఎవరో వేరు శనగ పంట నాశనం చేసేస్తున్నారని కాపలా ఉన్నాడంటా ఒకడు. ఆ పక్క పొలం వాడు వెళుతూ వెళుతూ ఓ రెండు మొక్కలు లాగాడంటా , వీడే వాడనుకుని పెద్ద గొడవ అంట.
అదే మొదటి , చివరి దొంగతనం. ఇంకొంచెం ప్రాక్టీసు చేసి కంటిన్యూ చేసుంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది ఇప్పటకీ . ఆ తరువాతా గంజి లో ఉప్పు, నిమ్మకాయ కలిపి తాగడం అలవాటు చేసుకున్నాను.
No comments:
Post a Comment