Wednesday, January 23, 2013

నా తెలంగాణా జ్ఞాపకాలు...

ఈ ఆంధ్ర తెలంగాణా గొడవలు చూస్తుంటే నాకున్న స్నేహితుల  జ్ఞాపకం గుర్తొస్తుంది...
ఫ్లాష్ బా.....క్ అని అరిచి  పారిపోకండి , ఒక పది నిమిషాల్లో అయిపోతుంది.

అరేయ్ వీళ్ళ ఊళ్ళో రిక్షాలు ఎలా ఉంటాయో తెలుసా , ఎద్దుల బండి ఎక్కినట్టు ఉంటుంది రా అని చెప్పి నవ్వాడు,
వాడితో పాటు మిగతా వాళ్ళంతా నవ్వారు.  నేను కూడా .
వాడి పేరు నరసింహ , నిజామాబాద్ నుండి వచ్చి హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. తెలంగాణా యాస లో చెప్పాడు , బాగుంది వింటుంటే. నేను సిటి కి రావడం అదే మొదటి సారి.

ఎక్కడో విశాఖపట్నం దగ్గరలో ఒక పల్లెటూరు నుండి హైదరాబాద్ కి ఎంసిఎ చదవడానికి వచ్చాను, అదే మొదటి సారి హైదరాబాద్ చూడటం.విశాఖపట్నం కూడా వెళ్ళింది లేదు ఎక్కువగా ఏదో ఒకటి రెండు సార్లు అంతే.
నా చదువంతా ఊళ్లోనే సాగింది, ఎంసిఎ  కి ఆంధ్ర యూనివర్సిటీ లో ఎలిజిబిలిటి లేకపోవడం వల్ల  ఉస్మానియా కి వచ్చాను. ఒక్కడినే వచ్చాను, వీళ్ళే నా ఫ్రెండ్స్ ఇక్కడ. వాళ్ళతోనే తిరిగేవాన్ని అన్ని ఓపికగా చూపించేవాళ్ళు దారులు తెలియకపోతే చెప్పేవాళ్ళు కుడా.

వీళ్ళని కలుసుకోవడం కూడా విచిత్రంగా జరిగింది , హైదరాబాద్ లో నాకు తెలిసినవాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల  హాస్టల్ వెతుక్కోవడం కష్టం అయింది, మొదట ఒక హాస్టల్ కి వెళ్లాను, అక్కడ ఆవిడ మాట్లాడింది చూస్తె నిజంగా మతిపోయింది  . మీరంతా మాకు కన్న కొడుకులతో సమానం బాబు , ఎక్కడెక్కడి నుండో చదువకోవడానికి వస్తారు, మీరు ఎలా తింటున్నారో అని మీ తల్లితండ్రులకి బెంగగా ఉంటుంది అందుకే అంకుల్ (ఆవిడ భర్త) కూడా పిల్లలకి తినేటప్పుడు అడ్డు చెప్పకు ఎంత కావాలంటే అంత పెట్టు అని చెప్తుంటారు. అదిగో అక్కడే టేబుల్ మీద పెడతాను మీ ఇష్టం వచ్చినంత పెట్టుకుని తినండి. కాని ఆవిడ కండిషన్ ఏంటంటే హాస్టల్ లో ఖచ్చితంగా ఒక సంవత్సరం ఉండాలి. నేను కొత్త అని ఆవిడకి తెలిసింది మాటల్లో, ఆ హాస్టల్  ఫిక్స్ అయిపోయాను, ఇంతలా తల్లి లా చూసుకునే ఆవిడ దొరకదని, కాని ఇంకా టైం ఉంది కదా సాయంకాలం వరకు వేరేవి కూడా చూద్దాం అని సాయంకాలం చెప్తానండి అని చెప్పాను. సరే బాబు నీ ఇష్టం త్వరగా చెప్పు లేకపోతే మళ్లి  ఆ బెడ్ ఫిల్ అయిపోతుంది అని.ఆవిడ గొంతు  సడన్ గా మరిపొయింది అలా చెప్తూ ఏదో అసంతృప్తి గా.

రెండో హాస్టల్ కూడా ఇంతే , అతను ఇలానే మాట్లాడాడు, same ఇంతలా తండ్రి లా చూసుకునేవాళ్ళు ఎవరు ఉంటారనిపించింది , ఇతను కూడా అదే కండిషన్ , వన్ ఇయర్ ఉండాలన్నాడు , ఇంటికి ఫోన్ చేసి కనుక్కోవాలండి అంటే, ఇదిగో చేయమ్మా అని వాళ్ళ ఫోన్ నా ముందు పెట్టాడు. ఏదో చెప్పి తప్పించుకున్నాను. అప్పుడు రోడ్ మీద వీళ్ళని అడిగాను , వాళ్ళ హాస్టల్ కి తీసుకునివెళ్ళారు, ఏ కండిషన్ లేకుండా అక్కడే జాయిన్ అయిపోయాను.

ఆ తరువాత వాళ్ళే చెప్పారు, ఆ మొదట చుసిన రెండు hostels దరిద్రం అని, చపాతి లు పాత హవాయి చెప్పుల్లా , ఇడ్లి లు నున్నగా బీచ్ లో రాళ్ళ లా ఉంటాయి, అంతే గట్టిగా ఉంటాయి కూడా అని. బతికాను రా బాబు అనుకున్న

నరసింహ విశాఖపట్నం లో ఇంటర్మీడియట్ చదివాడంట .వైజాగ్ బీచ్ గురించి, రిక్షాల గురించి చెప్పుకుని నవ్వుకునేవాళ్ళం. వీళ్ళు భలే సాగాతీస్తార్రా  మాటలని అని imitate  చేసి చెప్పేవాడు.అప్పుడప్పుడు నన్ను కూడా అలాగే పలకరించేవాడు కాని అదంతా తేలికగా తీసుకునేవాన్ని అవన్నీ జోక్స్ .

ఇక్కడ రిక్షాల్లో ఎలా కుర్చుంటారో నాకు ఆశ్చర్యంగా ఉండేది. పీట మీద కూర్చున్నట్టు ఉంటుంది , ఎప్పుడు ఎక్కే అవసరం రాలేదు కాని ఒకసారైన ఎక్కి ఉండాల్సింది. మా ఊళ్ళో అయితే ఒకో రిక్షాలో ముగ్గురు నలుగురు కూడా కూర్చుంటారు ఇక్కడేమో ఇద్దరి కన్నా ఎక్కువ కూర్చోలేరు . ఇంకా ఆశ్చర్యం ఏంటంటే , నన్ను మీది ఏ ఊరు అడిగిన వాళ్లకి మా ఊరు చెప్తే ఓ.. ఆంధ్రా నా.. అనేవారు, ఏంటి ఆంధ్రా నా అని అంటున్నారు ఇది ఆంధ్ర ప్రదేశే కదా అని అనుకునేవాన్ని.

ఎక్కడో వార్తల్లో వాతావరణ విశేషాలు చెప్పేటప్పుడు ఈ ఆంధ్ర ,తెలంగాణా , రాయలసీమ అని చూసేవాన్ని, ఆ తరువాత న్యూస్ లో చదివినట్టు గుర్తు, కాని ఇలా ప్రత్యేకంగా ఆంధ్రా అంటారని అప్పుడే తెలిసింది.
ఎంసిఎ  చదివేటప్పుడు చాలా మంది పరిచయం అయ్యారు, లోకల్ ఫ్రెండ్స్, రాయలసీమ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు.
హాస్టల్స్ మారడం వల్ల  ఇంకా ఎక్కువయ్యారు.

చిన్నప్పటి నుండి ఫెయిల్ అవ్వడం అంటే అదో పెద్ద గుండె గుబెల్. మార్కులు తక్కువ వస్తేనే మా నాన్న వాయించే దెబ్బలకి ఇంకా భయం వచ్చేసింది నాకు. అలాంటిది ఫస్ట్ సెమ్ లో హమ్మయ్య ఒక సబ్జెక్టు మాత్రమే పోయింది అని, రెండు మాత్రమె పోయాయి అని మాట్లాడుకుంటుంటే చాలా ఆశ్చర్యంగా ఉండేది నాకు. మీ నాన్న గారు ఏమి అనరా అని అమాయకంగా అడిగిన రోజు కూడా ఉన్నాది, వాళ్ళంతా నవ్వుతుంటే చాలా embarrassing గా అనిపించింది.

ఇంకో బుర్ర తిరిగిపోయే విషయం , ఫ్రెండ్స్ లో ఒకడు, మాటల సందర్భం లో మా అయ్యా , నేను , అన్నలు కలిసి తాగినాం అని చెప్పాడు. నేను షాక్ , అదేంటి నాన్నతో కలిసి తాగడం ఏంటి జోకేలేస్తున్నావా అని అడిగితే,  అరేయ్ నిజమేరా బాబు ఈడికి ఎట్లా చెప్పాల్రాబయి అని నవ్వాడు.,అసలు తాగడమే అత్యంత పెద్ద దారుణాతి దారుణమయిన విషయం అనుకుంటే , అది వాళ్ళ నాన్న తో కలిసి చేయడం నేను అస్సలు నమ్మలేదు వాడు ఎంత చెప్పినా , ఇంకో ఇద్దరు ముగ్గురు కలిసి నన్ను ప్రాధేయపడినా నమ్మలేదు ఆఖరకి ఒట్టేసి చెప్పాడు, నా గురించి వాళ్లకి తెలుసు కాబట్టి వివరంగా చెప్పారు.

ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది అదంతా...

వాళ్ళతో కలిసి హలీమ్ తినడం..
ఊరంతా సిటి బస్సుల్లో తిరగడం,
నేను పూత రేకులు తీసుకునివచ్చి ఇస్తే ఆశ్చర్యంగా తినడం ...
నీది ఆంధ్ర, నీది తెలంగాణా అని సరదాగా దెబ్బలాడుకోవడం ..
చాటింగ్ లో అమ్మయిలిచ్చే ఫోన్ నంబర్స్ గురించి నేను ఆశ్చర్యంగా వినడం...
సెకండ్ షో సినిమాలకి వెళ్లి రూం కి వెంటనే తిరిగి రాకుండా ఎక్కేదేక్కడో తిరిగి తిరిగి రావడం..
వాళ్ళు నన్ను ఆయ్  అని ఏడిపించడం ...
చార్మినార్ దగ్గర లెదర్ చెప్పులు స్పెషల్ గా తయారుచేయించుకోవడం, ఒకటి రెండు సార్లు లెదర్ చెప్పులని గర్వంగా చెప్తే ఆ తరువాత అదే పట్టుకుని ఏడిపించడం మొదలెట్టారు, ఇదేదో మొదటికే మోసం వస్తుందని ఇంకో జత కొనుక్కున్నాను.
మాటల్లో ఎన్నో విషయాలు, మనుషులు ఎలా ఉంటారో తెలిసింది అక్కడే. ఎలా మాట్లాడాలో ఎలా మెలగాలో ఎలా బతకాలో కూడా ...
నెల చివరకి డబ్బులు అయిపోతే ఒకడి నుండి ఒకడు అడుక్కోవడం , నిజంగా టీ కి కూడా డబ్బులుండేవి కాదు, కాని ఇంకొకరిని అడిగినా అది మాకు అవమానంగా ఉండేది కాదు, ఇంకా చెప్పాలంటే దబాయించి అడిగేవాళ్ళం, వాళ్ళు కూడా నన్ను అలానే ...

నిజంగా హైదరాబాద్ లో నేను చదివింది ఎంసిఎ నే   కాదు జీవితాన్ని కూడా.
ఇప్పటకి అంతా మంచి ఫ్రెండ్స్ గానే ఉన్నారు దేవుడి దయవల్ల

నేను ఇక్కడ రాసింది చాలా తక్కువా..ఇంకా ఎన్నో ఎన్నెన్నో మీకు కూడా ఇలాంటివి ఎన్నో ఉండచ్చు...

పోస్ట్ బాగా పెద్దది అయిపొయింది.. బోర్ కొడితే క్షమించండి.


No comments:

Post a Comment