Saturday, January 26, 2013

దీనికి మూలాలు ఎక్కడ

నిన్న, మొన్న ఫేస్బుక్ లో జరిగిన చర్చలకి బ్లాగ్లోకం, ఫేస్బుక్ చర్చలతో వేడెక్కింది.
అవి ఖచ్చితంగా  ఖండించాల్సిందే కాని ఎవ్వరూ  దీనికి కారణం ఏంటి , మూలాలు ఎక్కడ అని ఆలోచించడం లేదు.

ఢిల్లీ గ్యాంగ్ రేప్
పసి పిల్లల మీద అత్యాచారం
అమ్మాయిల మీద కామెంట్స్
రోజోకొక రేప్ న్యూస్
మనుషులని అత్యంతా పాశవికంగా హత్య చేయడం.

వీటి మీద అందరు పోలీస్ లకో, మీడియా వాళ్ళకో చెప్పడం, ఒక చర్చ కార్యక్రమాన్ని ప్రసారం చేసుకోవడం , వాళ్లకి శిక్ష పడితే పడుతుంది లేదంటే కేసు కొట్టివేయబడుతుంది. ఆ తరువాత మల్లి మన జీవితాలు మామూలే !!!

అంతేనా ?

ఇంకేం చేయడానికి లేదా ?

నలుగురికి తెలిసేటట్టు పబ్లిక్ లో చాట్ చేసుకున్నారు కాబట్టి అందరికి తెలిసింది, అదే వాళ్ళలో వాళ్ళు గ్రూప్ చాట్ చేసుకుంటే ఎవరకి తెలుస్తుంది ?
ఒక గది లో కుర్చుని ఈ కామెంట్స్ చేసుకుంటే ఎవరకి తెలుస్తుంది
బార్ లో కుర్చుని మందు కొడుతూ మాట్లాడుకుంటే ఎవరకి తెలుస్తుంది.

అంటే తెలియకుండా మాట్లడేసుకోవచ్చా ఎన్ని బూతులైనా ?

ఒక అబ్బాయి ఏ వయసు లో బూతులు నెర్చుకుంటున్నాడో తెలుసా ఎవరికైనా ?
బాయ్స్ / గర్ల్స్ హాస్టల్స్ లో ఏం మాట్లాడుకుంటారో ఎవరికైనా తెలుసా ?

బయటకి వెళ్ళిన మీ అబ్బాయి ఏం  చేస్తున్నాడో , ఎవరితో స్నేహం చేస్తున్నాడో తెలుసా ఏ పేరెంట్స్ కైనా.??
బయటకి వెళ్ళిన మీ అబ్బాయి రోడ్ మీద కనిపించే ఎన్ని అసభ్యకరమైన సినిమా పోస్టర్స్ చూస్తాడో తెలుసా ?

సినిమాల్లో లిప్ కిస్సేస్ ఏంటి
సినిమాల్లో శృంగారా తారా అంటే ఏంటి
ఐ లవ్ యు టీచర్ సినిమా ఏంటి
షకీలా సినిమాలు ఏంటి
డర్టీ పిక్చర్ సినిమా నాటికీ నేషనల్ అవార్డు ఆ సినిమా ఎందుకు హిట్ అయ్యిందో ఎవ్వరికైనా తెలుసు , అదో పెద్ద ఖలాఖండం అంటే చెప్తే మూతి మీద చాచి కొట్టాలి.
అది టీవీ లో రాత్రి పదకొండు తరువాత ప్రసారం చెయ్యాలి అంటే ఆ నిర్మాతలు కోర్ట్ లో కేసు కుడా వేసి గెలిచారు.
చూడగలరా ఆ సినిమాలు మీ పిల్లలతో కలిసి, ఏమయిపోయారు అప్పుడు ఈ జనాలు.
ఎన్ని సినిమాలు మీరు మీ ఫ్యామిలి తో కలిసి చూస్తున్నారు ?
సున్నీ లియోన్ కి ఆ పాపులారిటీ ఏంటి , భట్ ఫ్యామిలి తీసే సినిమాలు ఎలాంటివో తెలుసా ఎవ్వరికైనా ?
ఏమైంది ఈ వేళా తెలుగు  సినిమాలో డైలాగ్స్ విన్నారా , చూసారా , ఆ సినిమా హిట్ కూడా అయింది.
దర్శకుడు తేజా ఇంటర్మీడియట్ పిల్లల మధ్య ప్రేమ కలాపాలు చూపించినప్పుడు ???
టెన్త్ క్లాసు సినిమా సంగతి ఏంటి ??
ఇంటర్నెట్ లో ఎన్ని కోట్ల సెక్స్ సైట్స్ ఉన్నాయో తెలుసా ?

మీకు కోపం రావచ్చు కాని, ఏదన్న సంఘటన జరిగినప్పుడు మాత్రమే మనం బయటకి వస్తున్నాం ( నేను కుడా ).
ఆ తరువాత అది మామూలు అయిపోతుంది.

చివరగా ఒక విషయం , నా ప్రత్యక్షనుభవం.
నేను చూసాను హాస్టల్స్ లో, బయటకి ఎంతో నాగరికంగా మాట్లాడేవాడు , ఫోన్ లో అమ్మాయిలతో ఎంత దరిద్రంగా మాట్లాడాతాడో, అదో పెద్ద షాక్ నాకు, అమ్మాయిలు కూడా అలా మాట్లాడతారని అప్పుడే తెలిసింది.

ఏం చేద్దాం ?????


Wednesday, January 23, 2013

నా తెలంగాణా జ్ఞాపకాలు...

ఈ ఆంధ్ర తెలంగాణా గొడవలు చూస్తుంటే నాకున్న స్నేహితుల  జ్ఞాపకం గుర్తొస్తుంది...
ఫ్లాష్ బా.....క్ అని అరిచి  పారిపోకండి , ఒక పది నిమిషాల్లో అయిపోతుంది.

అరేయ్ వీళ్ళ ఊళ్ళో రిక్షాలు ఎలా ఉంటాయో తెలుసా , ఎద్దుల బండి ఎక్కినట్టు ఉంటుంది రా అని చెప్పి నవ్వాడు,
వాడితో పాటు మిగతా వాళ్ళంతా నవ్వారు.  నేను కూడా .
వాడి పేరు నరసింహ , నిజామాబాద్ నుండి వచ్చి హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. తెలంగాణా యాస లో చెప్పాడు , బాగుంది వింటుంటే. నేను సిటి కి రావడం అదే మొదటి సారి.

ఎక్కడో విశాఖపట్నం దగ్గరలో ఒక పల్లెటూరు నుండి హైదరాబాద్ కి ఎంసిఎ చదవడానికి వచ్చాను, అదే మొదటి సారి హైదరాబాద్ చూడటం.విశాఖపట్నం కూడా వెళ్ళింది లేదు ఎక్కువగా ఏదో ఒకటి రెండు సార్లు అంతే.
నా చదువంతా ఊళ్లోనే సాగింది, ఎంసిఎ  కి ఆంధ్ర యూనివర్సిటీ లో ఎలిజిబిలిటి లేకపోవడం వల్ల  ఉస్మానియా కి వచ్చాను. ఒక్కడినే వచ్చాను, వీళ్ళే నా ఫ్రెండ్స్ ఇక్కడ. వాళ్ళతోనే తిరిగేవాన్ని అన్ని ఓపికగా చూపించేవాళ్ళు దారులు తెలియకపోతే చెప్పేవాళ్ళు కుడా.

వీళ్ళని కలుసుకోవడం కూడా విచిత్రంగా జరిగింది , హైదరాబాద్ లో నాకు తెలిసినవాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల  హాస్టల్ వెతుక్కోవడం కష్టం అయింది, మొదట ఒక హాస్టల్ కి వెళ్లాను, అక్కడ ఆవిడ మాట్లాడింది చూస్తె నిజంగా మతిపోయింది  . మీరంతా మాకు కన్న కొడుకులతో సమానం బాబు , ఎక్కడెక్కడి నుండో చదువకోవడానికి వస్తారు, మీరు ఎలా తింటున్నారో అని మీ తల్లితండ్రులకి బెంగగా ఉంటుంది అందుకే అంకుల్ (ఆవిడ భర్త) కూడా పిల్లలకి తినేటప్పుడు అడ్డు చెప్పకు ఎంత కావాలంటే అంత పెట్టు అని చెప్తుంటారు. అదిగో అక్కడే టేబుల్ మీద పెడతాను మీ ఇష్టం వచ్చినంత పెట్టుకుని తినండి. కాని ఆవిడ కండిషన్ ఏంటంటే హాస్టల్ లో ఖచ్చితంగా ఒక సంవత్సరం ఉండాలి. నేను కొత్త అని ఆవిడకి తెలిసింది మాటల్లో, ఆ హాస్టల్  ఫిక్స్ అయిపోయాను, ఇంతలా తల్లి లా చూసుకునే ఆవిడ దొరకదని, కాని ఇంకా టైం ఉంది కదా సాయంకాలం వరకు వేరేవి కూడా చూద్దాం అని సాయంకాలం చెప్తానండి అని చెప్పాను. సరే బాబు నీ ఇష్టం త్వరగా చెప్పు లేకపోతే మళ్లి  ఆ బెడ్ ఫిల్ అయిపోతుంది అని.ఆవిడ గొంతు  సడన్ గా మరిపొయింది అలా చెప్తూ ఏదో అసంతృప్తి గా.

రెండో హాస్టల్ కూడా ఇంతే , అతను ఇలానే మాట్లాడాడు, same ఇంతలా తండ్రి లా చూసుకునేవాళ్ళు ఎవరు ఉంటారనిపించింది , ఇతను కూడా అదే కండిషన్ , వన్ ఇయర్ ఉండాలన్నాడు , ఇంటికి ఫోన్ చేసి కనుక్కోవాలండి అంటే, ఇదిగో చేయమ్మా అని వాళ్ళ ఫోన్ నా ముందు పెట్టాడు. ఏదో చెప్పి తప్పించుకున్నాను. అప్పుడు రోడ్ మీద వీళ్ళని అడిగాను , వాళ్ళ హాస్టల్ కి తీసుకునివెళ్ళారు, ఏ కండిషన్ లేకుండా అక్కడే జాయిన్ అయిపోయాను.

ఆ తరువాత వాళ్ళే చెప్పారు, ఆ మొదట చుసిన రెండు hostels దరిద్రం అని, చపాతి లు పాత హవాయి చెప్పుల్లా , ఇడ్లి లు నున్నగా బీచ్ లో రాళ్ళ లా ఉంటాయి, అంతే గట్టిగా ఉంటాయి కూడా అని. బతికాను రా బాబు అనుకున్న

నరసింహ విశాఖపట్నం లో ఇంటర్మీడియట్ చదివాడంట .వైజాగ్ బీచ్ గురించి, రిక్షాల గురించి చెప్పుకుని నవ్వుకునేవాళ్ళం. వీళ్ళు భలే సాగాతీస్తార్రా  మాటలని అని imitate  చేసి చెప్పేవాడు.అప్పుడప్పుడు నన్ను కూడా అలాగే పలకరించేవాడు కాని అదంతా తేలికగా తీసుకునేవాన్ని అవన్నీ జోక్స్ .

ఇక్కడ రిక్షాల్లో ఎలా కుర్చుంటారో నాకు ఆశ్చర్యంగా ఉండేది. పీట మీద కూర్చున్నట్టు ఉంటుంది , ఎప్పుడు ఎక్కే అవసరం రాలేదు కాని ఒకసారైన ఎక్కి ఉండాల్సింది. మా ఊళ్ళో అయితే ఒకో రిక్షాలో ముగ్గురు నలుగురు కూడా కూర్చుంటారు ఇక్కడేమో ఇద్దరి కన్నా ఎక్కువ కూర్చోలేరు . ఇంకా ఆశ్చర్యం ఏంటంటే , నన్ను మీది ఏ ఊరు అడిగిన వాళ్లకి మా ఊరు చెప్తే ఓ.. ఆంధ్రా నా.. అనేవారు, ఏంటి ఆంధ్రా నా అని అంటున్నారు ఇది ఆంధ్ర ప్రదేశే కదా అని అనుకునేవాన్ని.

ఎక్కడో వార్తల్లో వాతావరణ విశేషాలు చెప్పేటప్పుడు ఈ ఆంధ్ర ,తెలంగాణా , రాయలసీమ అని చూసేవాన్ని, ఆ తరువాత న్యూస్ లో చదివినట్టు గుర్తు, కాని ఇలా ప్రత్యేకంగా ఆంధ్రా అంటారని అప్పుడే తెలిసింది.
ఎంసిఎ  చదివేటప్పుడు చాలా మంది పరిచయం అయ్యారు, లోకల్ ఫ్రెండ్స్, రాయలసీమ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు.
హాస్టల్స్ మారడం వల్ల  ఇంకా ఎక్కువయ్యారు.

చిన్నప్పటి నుండి ఫెయిల్ అవ్వడం అంటే అదో పెద్ద గుండె గుబెల్. మార్కులు తక్కువ వస్తేనే మా నాన్న వాయించే దెబ్బలకి ఇంకా భయం వచ్చేసింది నాకు. అలాంటిది ఫస్ట్ సెమ్ లో హమ్మయ్య ఒక సబ్జెక్టు మాత్రమే పోయింది అని, రెండు మాత్రమె పోయాయి అని మాట్లాడుకుంటుంటే చాలా ఆశ్చర్యంగా ఉండేది నాకు. మీ నాన్న గారు ఏమి అనరా అని అమాయకంగా అడిగిన రోజు కూడా ఉన్నాది, వాళ్ళంతా నవ్వుతుంటే చాలా embarrassing గా అనిపించింది.

ఇంకో బుర్ర తిరిగిపోయే విషయం , ఫ్రెండ్స్ లో ఒకడు, మాటల సందర్భం లో మా అయ్యా , నేను , అన్నలు కలిసి తాగినాం అని చెప్పాడు. నేను షాక్ , అదేంటి నాన్నతో కలిసి తాగడం ఏంటి జోకేలేస్తున్నావా అని అడిగితే,  అరేయ్ నిజమేరా బాబు ఈడికి ఎట్లా చెప్పాల్రాబయి అని నవ్వాడు.,అసలు తాగడమే అత్యంత పెద్ద దారుణాతి దారుణమయిన విషయం అనుకుంటే , అది వాళ్ళ నాన్న తో కలిసి చేయడం నేను అస్సలు నమ్మలేదు వాడు ఎంత చెప్పినా , ఇంకో ఇద్దరు ముగ్గురు కలిసి నన్ను ప్రాధేయపడినా నమ్మలేదు ఆఖరకి ఒట్టేసి చెప్పాడు, నా గురించి వాళ్లకి తెలుసు కాబట్టి వివరంగా చెప్పారు.

ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది అదంతా...

వాళ్ళతో కలిసి హలీమ్ తినడం..
ఊరంతా సిటి బస్సుల్లో తిరగడం,
నేను పూత రేకులు తీసుకునివచ్చి ఇస్తే ఆశ్చర్యంగా తినడం ...
నీది ఆంధ్ర, నీది తెలంగాణా అని సరదాగా దెబ్బలాడుకోవడం ..
చాటింగ్ లో అమ్మయిలిచ్చే ఫోన్ నంబర్స్ గురించి నేను ఆశ్చర్యంగా వినడం...
సెకండ్ షో సినిమాలకి వెళ్లి రూం కి వెంటనే తిరిగి రాకుండా ఎక్కేదేక్కడో తిరిగి తిరిగి రావడం..
వాళ్ళు నన్ను ఆయ్  అని ఏడిపించడం ...
చార్మినార్ దగ్గర లెదర్ చెప్పులు స్పెషల్ గా తయారుచేయించుకోవడం, ఒకటి రెండు సార్లు లెదర్ చెప్పులని గర్వంగా చెప్తే ఆ తరువాత అదే పట్టుకుని ఏడిపించడం మొదలెట్టారు, ఇదేదో మొదటికే మోసం వస్తుందని ఇంకో జత కొనుక్కున్నాను.
మాటల్లో ఎన్నో విషయాలు, మనుషులు ఎలా ఉంటారో తెలిసింది అక్కడే. ఎలా మాట్లాడాలో ఎలా మెలగాలో ఎలా బతకాలో కూడా ...
నెల చివరకి డబ్బులు అయిపోతే ఒకడి నుండి ఒకడు అడుక్కోవడం , నిజంగా టీ కి కూడా డబ్బులుండేవి కాదు, కాని ఇంకొకరిని అడిగినా అది మాకు అవమానంగా ఉండేది కాదు, ఇంకా చెప్పాలంటే దబాయించి అడిగేవాళ్ళం, వాళ్ళు కూడా నన్ను అలానే ...

నిజంగా హైదరాబాద్ లో నేను చదివింది ఎంసిఎ నే   కాదు జీవితాన్ని కూడా.
ఇప్పటకి అంతా మంచి ఫ్రెండ్స్ గానే ఉన్నారు దేవుడి దయవల్ల

నేను ఇక్కడ రాసింది చాలా తక్కువా..ఇంకా ఎన్నో ఎన్నెన్నో మీకు కూడా ఇలాంటివి ఎన్నో ఉండచ్చు...

పోస్ట్ బాగా పెద్దది అయిపొయింది.. బోర్ కొడితే క్షమించండి.


Saturday, January 19, 2013

తెలుగు రాని ఆంధ్రుడు ....

ఒక్కోసారి మీరు ఊహించని మాటలు అవతలి వాళ్ళ దగ్గర నుండి వింటుంటే ఎలా ఉంటుంది ( బూతులు కాదండి బాబు ) అవతలి వాళ్ళు సీరియస్ గా చెప్పినా మనకి మాత్రం పిచ్చెక్కుతుంది. సినిమాల్లో మాత్రమే చుసిన నేను నాకే ఎదురైంది.

 హైదరాబాద్ లో చదువుకునేటప్పుడు జరిగింది. అందరిలానే అమెరికా కి వెళ్ళిపోవడానికి ఏదో ఒక institute లో జాయిన్ అయి జావా నేర్చేసుకోవాలి కాబట్టి జాయిన్ అయిపోయా. జావా కన్నా ముందు అమెరికా ఎలా వెళ్ళాలి అని   చెప్తుంటే పదవ తరగతి విధ్యార్ది లా వింటున్నాను. ఈ లోపు నా పక్కన కుర్చున్నవాడు ఏదో అడిగాడు నన్ను హిందీ లో.
మనకి హిందీ అంతంత మాత్రమె కాదు , అస్సలు లేదు.  వాడెం చెప్తున్నాడో అర్ధం కాలేదు.
నేను తిరిగి ఇంగ్లీష్ లో అడిగాను. వాడు ఏదో కులబడుక్కుని ఇంగ్లీష్ లో అడిగాడు, సమాధానం చెప్పేసాను.

హైదరాబాద్ institutes  లో మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాబట్టి అంత ఆశ్చర్యం కలిగించలేదు.
కాని మనదంతా ఒకే దేశం, పాపం ఎంతో దూరం నుండి మన సిటీ కి వచ్చాడని మాటలు కలిపి మంచి చెడ్డలు తెలుసుకుందామని , ఏ రాష్ట్రం మనది అని హిందీ లో కూడబలుక్కుని అడిగాను. అతనేమో లేదు నాది హైదరాబాదే అని అన్నాడు. వీడికి సరిగ్గా అర్ధం కాలేదేమో అని, ఇప్పుడు నువ్వు ఉంటున్న సిటీ కాదు అడిగింది, మీది  ఏ రాష్ట్రం అని మళ్ళి అడిగాను, మళ్ళి  అదే చెప్పాడు.
ఒక్కసారి మైండ్ బ్లాంక్ అయింది. తెలుగు రాదా మీకు అని అడిగాను, రాదు అని చాలా casual చెప్పాడు. వేరే రాష్ట్రం నుండి మైగ్రేట్ అయ్యారేమో అనుకుని మీ పేరెంట్స్ డి కూడా హైదరాబాదేనా అని అడిగాను, వాడికి చిరాకేసింది , మా పేరెంట్స్ దే కాదు నేను కూడా ఇక్కడే పుట్టి పెరిగాను అని చెప్పాడు.

నాకు మైండ్ బ్లాంక్ అయింది. చుస్తే హైదరాబాద్ లో పుట్టి పెరిగాను అని చెప్తున్నాడు, తెలుగు ఒక్క పదం కూడా రాదు అని చెప్తున్నాడు, ఈ సారి కొంచెం మొహమాటంగా , హైదరాబాద్ లో మీ ఇల్లు ఎక్కడా అని అడిగాను, ఏదో పేరు చెప్పాడు , చార్మినార్ కి అవతల అని చెప్పాడు.

హైదరాబాద్ లో పుట్టి పెరిగి తెలుగు రాకుండా ఎలా ఉంటుందో నాకు అస్సలు అర్ధం కాలేదు. నిజంగా నేను ఒక పది నిమిషాలు అది ఆలోచిస్తూ ఉన్నాను, వీడు గేమ్స్ అడుతున్నాడేమో అని అనుమానం వచ్చింది.కాని వాడి సమాధానాలు మాత్రం అలా లేవు. చాలా సీరియస్ గానే చెప్పాడు.

చాలా విచిత్రం అనిపించి , రూం కి రాగానే అందరకి చెప్పాను, వాడు ఇలా చెప్పాడు, వాడు సరదాగా చెప్పాడేమో అని డౌట్ గా ఉంది, తెలుగు రాకుండా ఎలా ఉంటుంది ఇక్కడే పుట్టి పెరిగినవాడికి అని.
ఆ రూం లో హైదరాబాది ఫ్రెండ్స్ కుడా ఉన్నారు, వాళ్ళు మాత్రం ఇదంతా కామన్ అన్నట్టు విని చెప్పారు,
ఇదంతా కామన్, ఓల్డ్ సిటీ లో ఉన్నవాళ్ళకి తెలుగు రాదనీ, వాళ్ళు నేర్చుకోవలసిన అవసరం రాదనీ. నిజంగా నమ్మబుద్ది కాలేదు నాకు , ఎంత ఇంట్లో మాట్లాడకపోయినా బయట మాట్లాడుతారు కదా అని అడిగాను.
బయట కూడా మాట్లాడే అవసరం ఉండదని , ఓల్డ్ సిటీ దాటి బయటకి అంతగా రాని  వాళ్లకి తెలుగు అస్సలు రాదు అని, నేర్చుకునే అవసరం కూడా ఉండదు, వాళ్ళ రోజు వారి పనులు , కలిసే మనుషులు అందరు ఉర్దూనే మాట్లాడతారు అని చెప్పారు.

ఇప్పటకి ఆశ్చర్యమే కొంచెం కూడా తెలుగు రాకుండా ఎలా ఉంటుంది అని....


Wednesday, January 9, 2013

ఆస్ట్రేలియా ప్రభుత్వం సూపర్ స్టార్ కృష్ణ తో విడుదల చేసిన స్టాంప్ పెద్ద బోగస్ అంట.

గత వారం రోజుల నుండి ఇంటర్నెట్ లో ఒక న్యూస్ హుల్ చల్ చేస్తుంది.
సూపర్ స్టార్ కృష్ణ ఫోటో తో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక స్టాంప్ విడుదల చేసింది అని.
కాని అదంతా వట్టి బోగస్ న్యూస్ అని తేలింది.

ఇది చుడండి..


ఈ వార్తా సినేజోష్ లో వచ్చింది.

ఇక్కడ ఫాన్స్ చుడండి ఎలా అభినందిస్తున్నారో..


నేను నిజంగా రిలీజ్ చేసారేమో అనుకున్నాను. కాని ఇక్కడ కృష్ణ యాక్ట్ చేస్తే అక్కడెక్కడో ఉన్న ఆస్ట్రేలియా లో
స్టాంప్ ఎందుకు రిలీజ్ చేసారో అర్ధం కాలేదు. వాళ్ళు ఈ మధ్యన ఇండియా మీద పడ్డట్టున్నారు , మొన్న సచిన్, ఇప్పుడు కృష్ణ అని సంబరపడ్డాను.
ప్చ్ ఎం చేస్తాం. ఎవడూ  ఇవ్వలేదని దూకుడు సినిమా లో బ్రహ్మానందం వాడి కి వాడే పద్మశ్రీ ఇచ్చుకుంటాడు.
అలా అయింది లాస్ట్ కి.


Tuesday, January 8, 2013

హోం గార్డ్ ని కాల్చి చంపిన నక్సలైట్లు

ఈ వార్త చూడండి.
ఒక మామూలు చిన్న ఉద్యోగం చేసుకునే హోం గార్డ్ ని పట్టుకుని సమాజాన్ని ఉద్దరించే నక్సలైట్లు కాల్చి చంపేశారు. 
అది ఒక హెచ్చరిక కూడా లేకుండా.


పోలీస్ ఉద్యోగాల్లో , హోం గార్డ్ ఉద్యోగమే చివరది. constable  తో సమానంగా కష్టపడిన వాళ్లకి వచ్చేది చాలా తక్కువ.
ఇళ్ళల్లో చాకిరి చేయించుకోడానికి ఎక్కువ మందిని వాడుకుంటారు.
ఒక మారు మూల పల్లెలో , ఆర్ధికంగా వెనకబడిన వాళ్లకి ఈ ఉద్యోగం ఎంతో అపురూపం.
తల్లి తప్ప ఎవరూ లేని అతన్ని ఒక హెచ్చరిక కూడా ఇవ్వకుండా వచ్చే అమానుషంగా కాల్చేశారు.
సమాజాన్ని ఉద్దరిస్తున్నామని బ్లాకు మెయిల్ చేసి డబ్బులు సంపాదించే పెద్ద మనుషులు.
అతను  చట్టాలు తయారు చేసే అంత పోసిషన్  లో లేడు .నక్సలైట్లు గురించి పెద్ద పెద్ద ఫ్యుహాలు పన్నే అంత అధికారం అతనకి లేదు. 
ఇప్పుడు ఆ తల్లి కి దిక్కెవరు. 
ఒకప్పుడు నాకు నక్సలైట్లు అంటే ఎంతో గౌరవం ఉండేది. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడకి వస్తారని ఒక హీరో వర్షిప్ ఉండేది.
కాని అవన్నీ బూటకాలు అని ఆ తరువాత అర్ధం అయింది. చదువు లేకుండా కేవలం డబ్బులు సంపాదించుకోడానికి అందులో జాయిన్ అవుతున్నారు. 
మా మండల కేంద్రం నుండి వాళ్లకి డబ్బులు వెళ్తాయి ప్రతీ సంవత్సరం. ఆ డబ్బులు ఇచ్చెవాలందరు  ఎదవ పనులు చేసి సంపాదిన్చినవాల్లె , ఈ నిజం ఊరు అంతటకి తెలుసు.
నాకు ఇప్పటకి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, అడవుల్లోనే ఉంటారు, గిరిజనులతో తిరుగుతారు, మరి వాళ్లకి కొంత చదువు అయిన నేర్పించంచు కదా.
స్కూల్స్, హాస్పిటల్స్ కట్టమని ప్రభుత్వాన్ని బెదిరించచ్చు. రోడ్లు వేయమని డిమాండ్ చేయోచ్చు కదా. అవన్నీ వాళ్ళ అభివృద్ధి లా ఎందుకు కనిపించవు వాళ్లకి.

Monday, January 7, 2013

వీడేనా వాడు ???

ఈ రోజు ఆంధ్రజ్యోతి లో ఒక వార్త చదివాను.

http://andhrajyothy.com/districtNewsShow1.asp?subCat=6&ContentId=43702&date=1/8/2013


నాకున్న తిక్కతో , వాడు పేరు తీసుకుని ఫేస్బుక్ లో వెతికాను. ఒక ప్రొఫైల్ వచ్చింది. అన్ని మ్యాచ్ అవుతున్నాయి.కాకపోతే రుజువు అవ్వకుండా మనం చెప్పకూడదు కదా ఇక్కడ.
ఇంకో విషయం ఏంటంటే laptop నుండి కంప్లైంట్ చేస్తే పోలీస్ లు react అవ్వడం కొంచెం ఆశ్చర్యంగా ఉంది.
అలాంటి ఫెసిలిటీ కుడా ఉన్నాదా ?



Sunday, January 6, 2013

కొబ్బరి దెయ్యం

కంగారు పడకండి , నేనేమి మిమ్మల్ని దెయ్యాలు కథలు చెప్పి రాంగోపాల్ వర్మ లా నవ్వించలేను
ఏదో నా చిన్న అనుభవం మిమ్మల్ని కొంచెం నవ్విస్తే  అంతే చాలు.

కొంచెం బ్యాక్ కి వెళితే .......
అయ్యో మిమ్మల్ని కాదండి బాబు, ఫ్లాష్ బ్యాక్ కి వెళితే అని అర్ధం. 

నేను 8th / 9th చదువుతున్నాను.
మా వీధి చివరన అంతా పెద్ద పెద్ద కొబ్బరి తోటలు. మా ఇల్లు కూడా ఆ చివరనే ఉండేది. మా ఇల్లు దాటితే అన్నీ పంట  పోలలే. ఒక సాయంకాలం, వీధిలో  ఫ్రెండ్స్ తో ఆటలన్నీ అయిపోయాకా అందరికి కొబ్బరి బొండాలు తాగాలని కోరిక పుట్టింది. కొరికితే పుట్టింది కాని బొండాలు ఎక్కడ దొరుకుతాయి. 
అమ్మ కొబ్బరి బొండాం తాగుతాను అంటే వెంటనే కొంగు ముడి విప్పి డబ్బులు ఇచ్చే కాలం కూడా కాదు అంతలా , మా ఇళ్ళల్లో మాత్రం అలా లేదు. అడిగితె ఒక్క అయిదు నిమిషాలు ఆగు , అన్నం వార్చి గంజి లో ఉప్పేసి ఇస్తాను అని చెప్తారు. పావాలా కి సోడా వచ్చే ఆ కాలం లో మా దగ్గర పది పైసలు కూడా ఉండేవి కాదు.
అందుకని ఇక నిర్ణయం తీసుకున్నాం, దొంగతనం చేయాల్సిందే అని.

ప్లాన్ రెడీ అయిపొయింది , ఒక గొనె సంచి తీసుకున్నాం. చెట్టు పైకి ఒకడు ఎక్కి కాయలు తెంచి కిందన పడేయాలి, కిందన మేము గొనె సంచి పట్టుకుని నిలబడతాం , అందులోనే పడేయాలి ఎందుకంటే నెల మీద పడితే మళ్ళీ సౌండ్ వస్తుంది. చెట్టు కూడా ముందే సెలెక్ట్ చేసేసాం. ఆ ముందు రోజు పొలాల్లో అడుకునేటప్పుడు ఒక చెట్టు చూసాం మరీ పొడవు గా ఏమి లేదు. కాయలు కుడా బాగానే ఉన్నాయి. సరే రాత్రి తొమ్మిది అయ్యింది అన్నం తినేసి అందరం బయటకి వచ్చాం. నలుగురం  బయలుదేరాం. అందరు ఒకటే ఆలోచిస్తున్నారు ఎవర్ని చేట్టేక్కిన్చాలా అని.
పొలాల్లో కి వచ్చాం ఒక అయిదు నిమిషాలు నడిచి అంతా చీకటి గా ఉంది, దూరంగా మా ఇల్లులు కనిపిస్తున్నాయి లైట్లు వెలగడం కనిపిస్తుంది. అప్పట్లో ఎప్పుడు ఆ బీడు భూముల లోను, పొలాల్లోనూ తిరిగేవాళ్ళం కాబట్టి పెద్ద భయం అనిపించలేదు మాకు. కొంచెం భయం ఉంది కాని, అవన్నీ మేము తిరిగినావే కాబట్టి ధైర్యంగానే ఉన్నాం.

చేట్టేవడు ఎక్కాలో కాసేపు గొడవపడి , ఎక్కినోడు ఒక కాయ ఎక్సట్రా  తాగుతాడు అని తీర్మానించి మొత్తానికి ఒకన్ని ఎక్కించాం . ఇప్పుడు చూడాలి నా సామి రంగా వాడు కాయ పట్టుకుని దానిని తిప్పడం మొదలెట్టాడు , మేము కత్తి తీసుకుని రావడం మర్చిపోయం కంగారులో, అయిదు నిమిషాలు అయింది ఇంకా తిప్పుతూనే ఉన్నాడు, కిందన మాకు తడిసిపోతుంది కంగారుకి. చుట్టూ చీకటి ,కప్పల సౌండ్, నక్కలు ఈలలు వేస్తున్నాయి. నలుగురుం ఉన్నాం కాబట్టి సరిపొయింది. త్వరగా రా అని అరవడానికి కూడా భయంగా ఉంది. ఏదో గుస గుస గా చెప్పాం కాని వినపడలేదు ఆ ఎదవకి. ఎలా వినపడుతుంది నక్కలు, కప్పలు ఏదో జూ  ఎన్ టి అర్ సినిమాకి విసిల్స్ ఎసినట్టు ఏస్తున్నాయి. మేమిద్దరం గోనెసంచి పట్టుకుని రెడీ గా ఉన్నాం. నాకు భయమేస్తుంది వాడు ఎక్కడ విసురుతాడో అని , అప్పుడు అనిపించింది  కొబ్బరి నీళ్ళు కన్నా గంజి నీళ్ళే ఎంతో బాగుంటాయి అని. అలాగే విసిరాడు కిందకి గురిచూసి , సంచి లోకి విసురుతాడు అనుకుంటే అవతలి వాడి జేబులో పడేటట్టు విసిరాడనుకుంటా, కొంచెం లో రాసుకుంటూ కింద పడింది, ఆ దెబ్బకి వాడు బూతులు §$%&/(/()= తిట్టి నేను చచ్చిన పట్టుకోను ఈ సంచి అని వదిలేసాడు. నాకు కూడా భయమేసింది కొంచెం వెనక్కి వెళ్లి నిలబడ్డాను. వాడు మూడు కాయలు తిప్పబోసరికి అరగంట పైనే అయిపొయింది.

అప్పుడు చూసాం దూరంగా ...

రెండు లాంతార్లు పరిగెడుతున్నాయి. మేము కొయ్యబారిపోయి చూస్తున్నాం. దూరంగా ఉన్నాయి , రెండూ  ఒకరికొకరికి దూరంగా వెళ్తున్నాయి దగ్గరకి వస్తున్నాయి. మాకేమి అర్ధం కావడం లేదు. కాని ఒకటి మాత్రం అర్ధం అయింది అవి కొరివి దెయ్యాలని , చిన్నప్పటి నుండి దెయ్యాల గురించి మాట్లాడుకున్నవన్ని ఒక్కసారిగా గుర్తొచ్చాయి. మాకు వణుకు మొదలైంది , అవి దగ్గరికే వస్తున్నాయి. మా వాడు తేరుకుని వొరేయ్ ధనా ( చెట్టు మీద ఉన్నవాడు ) దెయ్యం రొయ్  అని అరిచాడు. ఈసారి నక్కల కన్నా వీడే గట్టిగా అరిచాడు.
అంతే వాడు చెట్టు మీద నుండి సగమే కిందకి జారాడు, మిగతా సగం ఎలా వచ్చాడో తెలియదు, చుస్తే ఆల్రెడీ అందరు కాయలు పట్టుకుని పరిగెడుతున్నారు. నేను కూడా నా కాళ్ళ దగ్గర ఉన్న కాయ తీసుకుని పరిగెట్టాను. పరిగెత్తి పరిగెత్తి మా రోడ్ మీదకి వచ్చి ఒగుర్చుకుంటూ  నిలబడ్డాం. ఒకడిన్టిపక్కన  పక్కన కూలబడి చూసుకున్నాం. 
చేట్టేక్కినోడికి extraa  కాయకాదు కదా అసలు కాయే లేదు వాడికి. పాపం అందరి దగ్గర తల కొంచెం నీళ్ళు తాగాడు తిట్టుకుంటూ.
మరుసటి రోజు తెలిసింది , ఎవరో వేరు శనగ పంట నాశనం చేసేస్తున్నారని కాపలా ఉన్నాడంటా  ఒకడు. ఆ పక్క పొలం వాడు వెళుతూ వెళుతూ ఓ రెండు మొక్కలు లాగాడంటా , వీడే వాడనుకుని పెద్ద గొడవ అంట.

అదే మొదటి , చివరి దొంగతనం. ఇంకొంచెం ప్రాక్టీసు చేసి కంటిన్యూ చేసుంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది ఇప్పటకీ . ఆ తరువాతా గంజి లో ఉప్పు, నిమ్మకాయ కలిపి తాగడం అలవాటు చేసుకున్నాను.