నిజంగా ఆ సంఘటన తలుచుకుంటే నాకు ఇప్పటికి మనసు ఏదోలా అయిపోతుంది
Frankfurt నుండి ఢిల్లీ కి వస్తున్నాను 9.30 PM , ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో . నా పక్కనే ఒక తెలుగు వాడు కూర్చున్నాడు .
ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే ఇంగ్లీష్ లోనే మాట్లాడుకోవాలనే సాంప్రదాయాన్ని మేము అస్సలు మర్చిపోలేదు .
కాసేపు ఇద్దరం ఇంగ్లీష్ లోనే మాట్లాడుకున్నాం , పరిచయం చేసుకున్నాం .
ఇద్దరం ఒకే బాపతు అనుకుంట, కష్టపడి చెమటలు కక్కుతూ ఇంగ్లీష్ ఎందుకని తెలుగు లోకి వచ్చేసాం .
నేను అడిగే ప్రశ్నలకి అన్ని ఒక లైన్ ఆన్సర్ లు ఇస్తున్నాడు , అయాన్ ర్యాండ్ ఫౌంటెన్ హెడ్ ప్రభావం అని సరిపెట్టుకున్నాను .
తను ఓ రెండు బీర్లు , నేను ఓ ఆరంజ్ తాగేశాను, తినేశాం . మాటల్లో అతను ఇక్కడ ఏదో యూనివర్సిటీ లో చదువుతున్నాడు అని , సొంత ఊరు హైదరాబాద్ పక్కన అని, ఇప్పుడు ఫ్యామిలి అంత హైదరాబాద్ లోనే ఉంటున్నారు అని తెలిసింది .
ఢిల్లీ లో దిగేసరికి ఉదయం తొమ్మిది అయింది , అలా బయటకి వెళ్లి టిఫిన్ చేద్దామని, అరవ వాళ్ళ హోటల్ ఏదో ఉంది , వాంగొ అని . ఇడ్లి అంటే ప్రాణం కాబట్టి అది కూడా అరవ సాంబార్ తో ( అది ఎంత దరిద్రమైన నిర్ణయమో ఆ తరువాత అర్ధం అయింది ) . ఆ అబ్బాయిని కుడా లాక్కుని వెళ్లాను . తరువాతి ఫ్లైట్ కి చాలా టైం ఉంది అని .
ఇడ్లి ఆర్డర్ చేసాను , నా పట్ల ఎంతో ఆశ్చర్యం తో చూసాడు ఆ బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఉన్నవాడు , అర్ధం కాలేదు నాకు . రాత్రి నుండి చూస్తున్నాను ఆ అబ్బాయిని సరిగ్గా మాట్లాడడు , నా కన్నా చిన్నవాడు , నా తమ్ముడి వయసు ఉంటుంది అందుకే కొంచెం చొరవ తీసుకుని హోటల్ కి తీసుకుని వచ్చాను. మహానుబావుడు ఆ ఇడ్లి లు ఎవడు తయారు చేసాడో కాని , హోటల్ పెట్టినప్పుడు వండిన ఇడ్లి లు అనుకుంటా , వేడి చేసి తీసుకుని వచ్చాడు , గట్టిగా చప్పగా , airport లో అన్ని counters లో ఈ ఇడ్లి లనే పేపర్ వెయిట్ లా వాడుతున్నారేమో , సాంబార్ మాత్రం బాగానే ఉంది ఈ మధ్యనే చేసి ఉంటారు ఒక ఆరు నెలల క్రితం . ఆ అబ్బాయి ఆ ఇడ్లి ల వంక చూస్తూ కూర్చున్నాడు తినకుండా . ఏమైంది అని అడిగాను .
నా శాయశక్తుల ప్రయత్నించి ఒక ముక్క విరిచి నోట్లో పెట్టుకున్నాను , అప్పుడు చెప్పాడు ఆ అబ్బాయి
మా అ మ్మ చ ని పో యిo ది అని ....
నిజంగా నాకేం అర్ధం కాలేదు ఒక క్షణం , ఏం విన్నానో అర్ధం కాలేదు, నా మైండ్ అంతా బ్లాంక్ అయిపొయింది , ఏంటి అని రెట్టించి అడిగాను .
అమ్మ నిన్న చనిపోయింది సర్ సడన్ డెత్ . అందుకే వస్తున్నాను , ఏమైందో నాకు కుడా తెలియదు . నిన్న ఉదయం ఎనిమిది గంటలకి ఫోన్ వచ్చింది, ఎవరు ఏం చెప్పలేదు నాకు వీలయితే వెంటనే రమ్మని చెప్పారు .
వెంటనే టికెట్లు కోసం ట్రై చేసాను కాని international ఫ్లైట్ కి మూడు గంటల ముందు తీసుకోవాలంట ఉదయం ఫ్లైట్ లో దొరకలేదు , రాత్రి ఫ్లైట్ ఇది దొరికింది. నిన్నటి నుండి ఏడ్చి ఏడ్చి నా కళ్ళల్లో నీళ్ళు కూడా ఇంకిపోయాయి .
ఆఖరకి చివరి చూపు కూడ లేదు నాకు . నిన్న సాయంత్రం దహనం చేసేసారంట. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం . ఆ ముందు రోజే మాట్లాడాను ,నీరసంగా ఉందని చెప్పింది రేపు హాస్పిటల్ కి వెళ్తున్నాను అని చెప్పింది . అసలు ఇంటికి వెళ్ళాలంటే నే భయంగా ఉంది . అమ్మ లేదు అక్కడ , ఇంక ఉండదు అంటేనే నా మనసు నమ్మడం లేదు , ఇదంతా కల లా ఉంది . ఇక్కడకి వచ్చిన తరువాతా ఇంటికి వెళ్ళలేదు , ఇంకో మూడు నెలల్లో వెళ్దామని అనుకున్నాను సంవత్సరం అవుతుంది వచ్చి . ఇదిగో ఇప్పుడు ఇలా వెళ్తున్నాను.
నిజంగా నాకేమి అర్ధం కాలేదు . నిన్న రాత్రి నుండి ఈ అబ్బాయి సరిగ్గా మాట్లాడక పొతే ఏంటో అనుకున్నాను , కాని గుండెల్లో ఇంత బాధ పెట్టుకుని లోలోపల ఏడుస్తూ ...
మనసంతా ఏదోలా అయిపొయింది ..
మొహం చుసిన వెంటనే ఏమైంది రా అలా ఉన్నావు అని అడిగే అమ్మ
అన్నం తినేటప్పుడు పక్కన కుర్చుని విసనకర్ర తో విసురుతూ ఏం ఎండలో ఏంటో అని తిడుతూ మాట్లాడే అమ్మ ..
నాన్న దెబ్బలకి అడ్డు వచ్చే అమ్మ ..
ఎక్కడి నుండి ఫోన్ చేసినా, ఎప్పుడు ఫోన్ చేసినా మొట్ట మొదటి గా అడిగే మాట బొంచేసావు రా ? అని అడిగే అమ్మ
ఆ అబ్బాయికి ఇకా ఆ ఫోన్ ఉండదు , ఆ మాటలు వినిపించవు , గట్టిగా అరిచి పిలిచినా అమ్మ రాదు తనకి . అమ్మ ఎవరికైనా అమ్మే .
ఊహించుకుంటే నాకు ఒళ్ళు జలదరించింది ..
ఈ జీవితం ఏంటో , ఈ ఉద్యోగాలు ఏంటో , ఈ బతుకులు ఏంటో ..
ఏటికి ఎదురు ఈదుతున్నామా ? ఏట్లో పడి కొట్టుకుపోతున్నామా ?
మన వాళ్ళ కి పిలిస్తే పలికే అంత దూరం లో కూడా లేకుండా ..
డబ్బే సర్వస్వం కాదు అని తెలుసు, కాని డబ్బు లేకపోతే వచ్చే కష్టాలు ఊహించుకుంటే నే భయంగా ఉంది .
కాకుల్ల పొడుచుకుని తినేసే ఈ సమాజం మీద కోపం వస్తుంది . మనిషి కి మనిషి సాయం అన్న మాటలే వినపడటం లేదు. డబ్బు డబ్బు డబ్బు .
ఆ అబ్బాయిని ఎలా ఓదార్చాలో అర్ధం కాలేదు. అసలు ఆ బాధ కి ఓదార్పు ఉండదు , కాలమే తగ్గించాలి .
ఇప్పటకి నాకు ఆ సంఘటన తలుచుకుంటే ఏదోలా అనిపిస్తుంది .
emito.. bratikestunnaam. Pch :(
ReplyDelete